జూరాల కుడి కాలువకు సాగునీటి విడుదల..
జూరాల కుడి కాలువకు సాగునీటి విడుదల..
MLA


జోగులాంబ గద్వాల, 29 జూలై (హి.స.)

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్

మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు బుధవారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువలోకి నీటిని వదిలారు. నీటి విడుదలతో రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గురుపౌర్ణమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జూరాల నుంచి సాగునీటి విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సహచర ఎమ్మెల్యేలకు గద్వాల నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాకపోవడంతో నీటి లభ్యతపై ఒత్తిడి నెలకొందన్నారు. అయినప్పటికీ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాగునీటిని విడుదల చేసిందని పేర్కొన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా రెండు పంటలకు సరిపడేలా దశలవారీగా వినియోగించుకోవాలని సూచించారు.

నారాయణపూర్ డ్యామ్ నుంచి కూడా గేట్లు ఎత్తి దిగువన జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలను సాగు చేయాలని, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని రైతులకు సూచించారు. కూరగాయలు, పండ్ల తోటలు, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారిస్తే నీటి వినియోగం తగ్గుతుందని చెప్పారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని, రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande