
నాగర్ కర్నూల్, 29 జూలై (హి.స.)
బల్మూర్ మండల సమగ్ర అభివృద్ధే
లక్ష్యంగా ప్రతి శాఖ అధికారి సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అచ్చంపేట ఎమ్మెల్యే, టిపిసిసి ఉపాధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సూచించారు. బల్మూర్ మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, తాగునీటి సరఫరా, విద్య, వైద్యం, వ్యవసాయం, రహదారులు, మౌలిక వసతులు తదితర అంశాలపై అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతి శాఖ అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణమే పరిష్కరించేలా కృషి చేయాలని ఆదేశించారు. మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శకత, జవాబుదారితనం, సేవాభావంతో అధికారులు విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..