
కాళేశ్వరం, 29 జూలై (హి.స.)
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మాట్లాడటం సిగ్గుచేటని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును సరిగా కట్టి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చి ఉండేదే కాదన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదిక మేరకే కాళేశ్వరం విషయంతో తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు నీళ్లు ఇచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ నెల 31న ఢిల్లీలో ఎన్డీఎస్ఏ సమావేశానికి పిలిచిందని తెలంగాణ ప్రభుత్వంతో పాటు సీడబ్ల్యుసీని కూడా పిలిచిందన్నారు. ఈ సమావేశంలో కాళేశ్వరంపై సమీక్ష చేసి ఎలా ముందుకు వెళ్లాలనేది నిర్ణయం తీసుకుంటామన్నారు.
మాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని, పద్దతి ప్రకారమే ముందుకు వెళ్తున్నామన్నారు. కాళేశ్వరం బ్యారేజీలు కేసీఆర్ హయాంలో నిర్మించడం వారి హాయంలోనే కూలిపోయాయన్నారు. ఎన్డీఎస్ఏ వచ్చి ఈ మూడు బ్యారేజీ గేట్లు తెరిచి ఉంచాలనే ఆదేశాలు ఇచ్చిందన్నారు. నాణ్యతా లోపాలతో బీఆర్ఎస్ కాళేశ్వరంను నిర్మించిందన్నారు. ఎలా పడితే అలా మాట్లాడటానికి కేటీఆర్ సిగ్గుపడాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు