భారీ వర్షాన్నీ లెక్కచేయని భక్తి.. మంత్రుల కొండగట్టు గిరిప్రదక్షిణ
భారీ వర్షాన్నీ లెక్కచేయని భక్తి.. మంత్రుల కొండగట్టు గిరిప్రదక్షిణ
Kondagattu


కొండగట్టు, జగిత్యాల, 29 జూలై (హి.స.)

గురు పౌర్ణమి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో నిర్వహించిన గిరిప్రదక్షిణ భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, జలాశయాలు నిండిపోవడంతో పాటు రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గిరిప్రదక్షిణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ అనంతరం శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలతో పాటు వ్యవసాయం అభివృద్ధి చెందాలని, ప్రతి రైతు ఆనందంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. భారీ వర్షం మధ్య కూడా ప్రజాప్రతినిధులు భక్తులతో కలిసి కాలినడకన గిరిప్రదక్షిణ పూర్తి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గురు పౌర్ణమి సందర్భంగా కొండగట్టు క్షేత్రానికి తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తాగునీరు, వైద్య సేవలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లను పటిష్టంగా అమలు చేయడంతో కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande