
శ్రీశైల, 29 జూలై (హి.స.)
శ్రీశైల మహాక్షేత్రంలో ఆషాఢ పూర్ణిమ (గురు పూర్ణిమ) పర్వదినాన్ని పురస్కరించుకుని భ్రమరాంబికా దేవి అమ్మవారికి శాకాంబరీ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ విశేష మహోత్సవంలో భాగంగా ఆలయ గర్భాలయాన్ని, ముఖమండపాన్ని మరియు అమ్మవారిని సుమారు 30 రకాలకు పైగా వేలాది కిలోల రంగురంగుల తాజా కూరగాయలు, ఆకుకూరలు, వివిధ రకాల నోరూరించే ఫలాలతో కనువిందుగా అలంకరించారు.లోకకల్యాణం కోసం, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలనే సంకల్పంతో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపారు. గురు పూర్ణిమ పుణ్యదినం కావడం, దానికి తోడు అమ్మవారు అరుదైన శాకాంబరీ దేవి రూపంలో దర్శనమివ్వడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశం నలుమూలల నుండి భక్తులు శ్రీశైలానికి పోటెత్తారు. స్వామివార్ల దర్శనం కోసం క్యూలైన్లు పూర్తిగా నిండిపోగా, ఆలయ పరిసరాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi