
హైదరాబాద్, 29 జూలై (హి.స.) ఉప్పల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే ఉప్పల్ రింగ్ రోడ్ ప్రధాన రహదారిని అధికారులు మరోసారి మూసివేశారు. రెండు నెలలపాటు మరమ్మతుల కారణంగా మూసివేసిన ఈ రహదారిని ఇటీవలే, గత శుక్రవారం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే మంగళవారం నగరంలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో రహదారిపై పలు చోట్ల గుంతలు ఏర్పడటంతో వాహనదారుల భద్రత దృష్ట్యా రహదారిని క్లోజ్ చేశామని ఉప్పల్ ట్రాఫిక్ సీఐ నాగరాజు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా రోడ్డు ఉపరితలం దెబ్బతినడంతో వాహనాలు వేగంగా ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలను గుర్తించలేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేసినట్లు వివరించారు.దీంతో ఉప్పల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించారు. ట్రాఫిక్ పోలీసులు అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు.స్థానికులు మాత్రం ఇటీవలే ప్రారంభించిన రహదారి మళ్లీ మూసివేయాల్సిన పరిస్థితి రావడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అభిప్రాయపడుతున్నారు. నాణ్యమైన రహదారి నిర్మాణం చేపట్టాలని, వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
రోజూ వేలాది మంది ప్రయాణించే ప్రధాన రహదారిని ఈ స్థితిలో వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. రోడ్డు తవ్విన వారు మరమ్మతులు చేయించే బాధ్యత ఎందుకు తీసుకోవడం లేదు? ప్రజల ప్రాణాలకు విలువ లేదా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఒక శాఖపై మరో శాఖ బాధ్యత నెట్టేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దెబ్బతిన్న రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టి, వాహనదారుల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..