
హైదరాబాద్, 29 జూలై (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా జలాశయానికి ఈరోజు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో నిరంతరాయంగా పెరుగుతోంది. దీనికి తోడు చింతవాగు, రోటెంత వాగు, పగిడి వాగుల నుంచి వరద ఉధృతి తోడవడంతో జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువవుతోంది.పరిస్థితిని గమనించిన ఇరిగేషన్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. నీటిమట్టాన్ని నియంత్రించేందుకు గాను ప్రాజెక్టుకు చెందిన 22 స్పిల్వే గేట్లను ఎత్తివేసి, సుమారు 30 వేల క్యూసెక్కుల మిగులు నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi