తెలంగాణకు తుఫాను ముప్పు: ఉత్తర జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు
తెలంగాణకు తుఫాను ముప్పు: ఉత్తర జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు
Weather


హైదరాబాద్, 29 జూలై (హి.స.)

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర తెలంగాణ (North Telangana) జిల్లాల్లో గడిచిన 20 గంటలుగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం (Core Depression) తెలంగాణ వైపు దూసుకొస్తుంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రాగల 36 గంటల్లో అత్యంత భారీ నుంచి తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని 'తెలంగాణ వెదర్ మ్యాన్' అప్రమత్తం చేశారు. ముఖ్యంగా జూలై 29, 30 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు అత్యంత తీవ్రంగా మారనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 300 మిమీ నుంచి 450 మిమీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీనివల్ల భారీగా వరదలు ముంచెత్తుతాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. పింక్ అలర్ట్లో భాగంగా అత్యంత ప్రమాదకర వర్షపాతం నమోదయ్యే జిల్లాల ప్రజలను తక్షణమే అప్రమత్తం చేయాలని, ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక జిల్లాల పరిపాలన యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు మధ్య, పశ్చిమ, తూర్పు తెలంగాణ పరిధిలో రెడ్ అలర్ట్ జారీ అయింది. దీంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు రోజు మొత్తం ముసురు వాతావరణం నెలకొంటుందని వెదర్ మ్యాన్ తెలిపారు. అలాగే నాగర్కర్నూల్, వనపర్తి, నల్గొండ వంటి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం స్వల్ప వర్షపాతం మాత్రమే నమోదు కానుందని వెదర్ మ్యాన్ తన నివేదికలో స్పష్టం చేశారు. ప్రమాదకర పరిస్థితులు ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande