
హైదరాబాద్, 29 జూలై (హి.స.)
ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా వరద ఉధృతి తీవ్ర రూపం దాల్చడంతో దాదాపు 2.03 లక్షల మందిపైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 27,967 మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వరదల కారణంగా ధెంకనాల్ జిల్లాలోనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మూగజీవాలు కూడా మృతి చెందాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నాయి. మొత్తం ఆరు జిల్లాల్లోని 44 బ్లాకులు, 233 గ్రామ పంచాయతీలు, 748 గ్రామాలు వరద నీటిలో చిక్కుకోగా, 226 గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి.
ఈ వరదల ప్రభావం బాలాసోర్ జిల్లాపై అత్యధికంగా పడింది. అక్కడ 12 బ్లాకుల్లోని 378 గ్రామాలకు చెందిన లక్షకు పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలాసోర్‌లో 19,080 మందిని తరలించి 125 కాంపుల ద్వారా సుమారు 17,000 మందికి వసతి, ఆహారం కల్పిస్తున్నారు. అలాగే భద్రక్ జిల్లాలో 80,000 మంది, జాజ్‌పూర్‌లో 11,000 మంది, మయూర్‌భంజ్‌లో 2,487 మంది వరదల వల్ల బాధితులుగా మారారు. వర్షాలు, నీటిముంపు కారణంగా 11 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సంబల్‌పూర్, ధెంకనాల్ జిల్లాల్లో కూడా వరద ప్రభావం తీవ్రంగా ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 761 ఇళ్లు ధ్వంసం కాగా, సుమారు 7,901 హెక్టార్లలో పంట పొలాలు నీటమునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాధితుల కోసం ప్రభుత్వం 212 పునరావాస కేంద్రాలను, పశువుల కోసం 3 ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసింది. బాధితులకు బియ్యం, అటుకులు, బెల్లం, పాలిథిన్ షీట్లు మరియు పశుగ్రాసాన్ని అత్యవసర సహాయంగా అందిస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అను గర్గ్ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ వైద్య బృందాలను రంగంలోకి దించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi