
ఇస్లామాబాద్, 29 జూలై (హి.స.)
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తన నోటి దురుసుతో భారత్ పై వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న పౌరులకు, భారత్కు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని ఆయన వ్యాఖ్యానించారు. PoK నిరసనకారులను 'పాకిస్తాన్ శత్రువులు గా అభివర్ణించిన ఆసిఫ్, వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై పాక్ సైన్యం జరిపిన కాల్పులను ఆయన బహిరంగంగా సమర్థించుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఖవాజా ఆసిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. PoK ప్రజలను భారత్తో పోల్చడం ద్వారా, భారత్- PoK ఒకటే అని తాము ఎప్పటినుంచో చెప్తున్న మాటను పాక్ మంత్రి స్వయంగా అంగీకరించారని నెటిజన్లు ఆయనకు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. సొంత ప్రజల డిమాండ్లను పరిష్కరించడం చేతకాక, ఆందోళనకారులపై దాడులు చేస్తూ భారత్పై నిందలు వేయడం పాకిస్థాన్ అలవాటుగా మారిందని పలువురు మండిపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..