దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సుప్రీంకోర్టులో ఊరట!
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సుప్రీంకోర్టులో ఊరట!
Supreme court


న్యూఢిల్లీ, 29 జూలై (హి.స.)

తలబిరా-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుల కేసులో దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు ఊరట లభించింది. ఈ కేసులో మన్మోహన్ సింగ్ సహా మరో ఐదుగురిని నిందితులుగా సమన్లు జారీ చేస్తూ 2015లో ప్రత్యేక సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసింది. సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ నివేదికలను అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం, వాటిని తిరస్కరించి నేరాలను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రత్యేక న్యాయమూర్తికి ఎటువంటి చెల్లుబాటు అయ్యే ఆధారాలు లేవని స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అప్పీళ్లను అనుమతిస్తూ, మార్చి 11, 2015 నాటి ఆదేశాలను రద్దు చేసింది. మెరిట్స్ ఆధారంగా ఈ వ్యవహారాన్ని పూర్తిగా ముగించింది.

2005 నాటి తలబిరా-2 కోల్ బ్లాక్ కేటాయింపులకు సంబంధించి నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం అభియోగాలపై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు ఐదుగురిని విచారణకు హాజరుకావాలని ప్రత్యేక సీబీఐ కోర్టు 2015 మార్చి 11న సమన్లు పంపిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ రెండుసార్లు సమర్పించిన క్లోజర్ రిపోర్టులను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చగా, 2015 ఏప్రిల్ 1న సుప్రీంకోర్టు ఆ విచారణపై స్టే విధించింది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో సీబీఐ సమర్పించిన క్లోజర్ నివేదికలకు ఆమోదం లభించడమే కాకుండా, ఈ కేసులో దివంగత మన్మోహన్ సింగ్పై ఉన్న అన్ని ఆరోపణలు తొలగిపోయాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande