అలర్ట్.. అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దు
హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ నెలకొంది. అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Traffic hyd alert


హైదరాబాద్, 30 జూలై (హి.స.)భారీ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షాల ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ నెలకొంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు గురువారం మధ్యాహ్నం నుంచి ఉద్యోగులకు దశలవారీగా ముందస్తు లాగౌట్ ఇవ్వాలని కోరారు. అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సూచనలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణించేవారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఫతేనగర్–బాల్కంపేట్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. కాగా, హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వానకు రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రధాన కూడళ్ల వద్ద భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడి వాహనాల రాకపోకలు స్తంభించాయి. వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande