మీ సమస్యలు నాకొదిలేయండి.. ఉపాధ్యాయ సంఘాలకు సీఎం రేవంత్ హామీ
మీ సమస్యలు నాకొదిలేయండి.. ఉపాధ్యాయ సంఘాలకు సీఎం రేవంత్ హామీ
Cm


హైదరాబాద్, 30 జూలై (హి.స.)

విద్యాశాఖలో సంస్కరణలపై మాట్లాడుతుంటే ఉపాధ్యాయ సంఘాలు నా మీద కోపంగా మాట్లాడుతున్నాయని కానీ నేను ఆ ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఒక్కటే చెబుతున్నాను.. మీ సమస్యలు నాకు వదిలేయండి. మీరు దేనిపై కొట్లాడుతున్నారో అవన్నీ నేను చూసుకుంటాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని మీరు అడగకముందే మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాదన్నారు. మీ ప్రమోషన్లు, మీ బదిలీలు అన్నీ అడగకముందే మీ ఇంటి వరకు పంపించానని ఇకపై కూడా మీ సమస్యల పరిష్కారం బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు. అందువల్ల ఇకపై మీరు మీకోసం కాకుండా విద్యార్థుల సమస్యలపై నాతో కొట్లాడాలన్నారు. ఫిన్లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా 55 రోజుల్లో 11 వేల టీచర్లు రిక్రూట్మెంట్ చేశామని ఇలా ఎప్పుడైనా జరిగిందా? అని సీఎం ప్రస్నించారు. ఈ ప్రభుత్వం మీదని అందుకోసమే మీకోసం పని చేస్తున్నామన్నారు. మీ సమస్యల పరిష్కారం పూచీ నాదని చెప్పారు. రాబోయే ఐదేళ్ల ప్రపంచ దేశాలు తెలంగాణ విద్యాశాఖను చూసే విధంగా పంచవర్ష ప్రణాళిక తరహాలో ఉపాధ్యాయ సంఘాలు ప్రతిజ్ఞబూని పని చేయాలని పిలుపునిచ్చారు. ఇలా చేస్తే విద్యాశాఖ ఎలా మారదో నేనూ చూస్తానన్నారు. ఏ ప్రభుత్వమైనా టీచర్లకు తలొగ్గాల్సిందేనని ఒక ఐఏఎస్ను ట్రాన్స్ ఫర్ చేయడం సులభం కానీ ఉపాధ్యాయులను బదిలీ చేయడం అంత సులభం కాదన్నారు. దేశానికి విద్య, వైద్యంలో నాయకత్వాన్ని తెలంగాణ నుంచి ఎందుకు ఇవ్వలేమని ప్రశ్నించారు.

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2014 నుంచి 2023 వరకు డ్రాపౌట్స్ తగ్గి అడ్మిషన్లు పెరిగాయని అదే మేము అధికారంలో వచ్చాక 2023-2026 వరకు అడ్మిషన్లు ఎందుకు పెరుగుతూ వస్తున్నాయంటే విద్యాశాఖలో మేం తీసుకొచ్చిన సంస్కరణలే కారణం అన్నారు. మేము పని చేసుకుంటూ వెళ్తుంటే రాష్ట్రంలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేరని అర్జంట్గా రేవంత్ రెడ్డి విద్యాశాఖకు మంత్రిని నియమించాలని కొంత మంది మాట్లాడుతున్నారు. నేను మంచిగా పని చేసినందుకు విద్యాశాఖ నుంచి తొలగిపోవాలా? అని ప్రశ్నించారు. విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని తీసుకువచ్చినందుకా?, 30 వేల మంది టీచర్లకు బదిలీ చేసినందుకా?, ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకా? ఎందుకు విద్యాశాఖ నుంచి వైదలగాలని ప్రశ్నించారు. తాను తీసుకుంటున్న నిర్ణయాలు అధికారం ఉంది కాబట్టి తీసుకోవడం లేదని మానవత్వంతో ఆలోచించి తీసుకుంటున్నానన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande