
హైదరాబాద్, 30 జూలై (హి.స.)హైదరాబాద్ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమవుతుండగా.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మాన్సూన్, డిజాస్టర్, స్టాటిక్ థీమ్స్ ఆధారంగా హైడ్రా అధికారులు ప్రత్యేక అలర్ట్ జారీ చేసి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
వర్షాల ప్రభావంతో నగరంలోని వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో నీరు నిల్వ కాకుండా భారీ మోటర్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఐటీ కారిడార్లోని రాయదుర్గం, బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్ ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. కూకట్పల్లి, బుల్కాపూర్, పికెట్ నాలాలాల నుంచి పెద్దఎత్తున వరద నీరు హుస్సేన్ సాగర్లోకి చేరుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్