
అమరావతి, 30 జూలై (హి.స.)
, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు(గురువారం) భేటీ అయ్యారు. సూపర్ ఎల్నినో పరిస్థితులపై చర్చించారు. సూపర్ ఎల్నినో, తద్వారా రాష్ట్రంలో నెలకొన్న సాగు నీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని పవన్ సూచించారు. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులను వివరించాలన్నారు. సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని అన్నారు. ఏలేరు ప్రాజెక్టు నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు నిమ్మలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
నీటి విడుదలతో పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట రైతులకు సాగునీటి సమస్యకు ఊరట లభించిందని పవన్ అన్నారు. సూపర్ ఎల్నినో ప్రభావంపై గ్రామస్థాయిలో ప్రచారం చేపట్టాలని సూచించారు. ప్రతి రైతు పీఎం ఫసల్ బీమా యోజనలో చేరేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం ప్రతి నీటి బొట్టు విలువైనదే అని... నీటి వృథాను అరికట్టాలని చెప్పారు. కాలువల్లో పూడిక తొలగింపు, నీటి గట్టుల లీకేజీల నివారణపై దృష్టి సారించాలన్నారు. కాకినాడ జిల్లా, పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్నినోపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలు చేశారు. ఈ సందర్భంగా భుజం శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ను మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు. త్వరగా కోలుకుని ప్రజాసేవలో మరింత చురుగ్గా పాల్గొనాలని నిమ్మల ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ