
హైదరాబాద్, 30 జూలై (హి.స.)
ప్రజా పాలనలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో 76.45 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం శంకుస్థాపనలు చేశారు. మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలోని రామంతపూర్, వెంకట్రెడ్డి నగర్, చిల్కానగర్, ఉప్పల్, చర్లపల్లి, తదితర డివిజన్లలో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీలు, ఉప్పల్ బస్ స్టాప్, ఇతర మౌలిక వసతుల పనులను డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మందముల పరమేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, ఉప్పల్ బస్ స్టాప్, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్థానిక ప్రజల సమస్యలను కాంగ్రెస్ ఇన్చార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి తన దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. 2034 వరకు దీర్ఘకాలిక ప్రణాళికతో నగరాభివృద్ధి చేపడుతున్నామని, భవిష్యత్తులో వరదలు, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ఆధునిక వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉప్పల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎన్టీపీ) నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..