
మంచిర్యాల, 30 జూలై (హి.స.)
ప్రస్తుతం కురుస్తున్న వర్ష పరిస్థితుల్లో ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భశాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటి గోడ కూలిన ఘటనలో గాయాలై చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్, ఎమ్మార్వోలు భీష్మ, శ్రీధర్, కోటపల్లి మండల తహసీల్దార్ రాఘవేంద్రలతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కోటపల్లి మండలం ఆలుగాం గ్రామానికి చెందిన ఆత్రం మాంతయ్య ఇంటి గోడ కూలి ఇంట్లో ఉన్న ఆత్రం లక్ష్మి తలకు, ఆత్రం అనిల్ చేతికి గాయాలై మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం వర్ష పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వర్షాల కారణంగా ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, క్యాతనపల్లి, చెన్నూర్ మున్సిపల్ కమిషనర్లకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజా సంరక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు