వరదలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం.. ఆసిఫాబాద్ కలెక్టర్
వరదలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం.. ఆసిఫాబాద్ కలెక్టర్
Collector


ఆసిఫాబాద్, 31 జూలై (హి.స.)

వరదల పరిస్థితిపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. శుక్రవారం కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరద ప్రవాహాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన కలెక్టర్, నదిలో నీటిమట్టం, వరద ఉధృతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

రాబోయే రోజుల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం పుష్కర ఘాట్ సమీపం వరకు నీటిమట్టం చేరిందని, పరిస్థితిని బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని వెల్లడించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్న కలెక్టర్, ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande