
జోగులాంబ గద్వాల, 31 జూలై (హి.స.)
అర్హులైన ప్రతి ఒక్కరూ ఎన్యుమరేషన్ పత్రాలను పూరించి ఇస్తేనే ఎలక్ట్రోరోల్లో ఓటరుగా నమోదు కాబడతారని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం గద్వాల పట్టణంలోని 17వ వార్డు భీమ్ నగర్, రెవెన్యూ కాలనీలకు సంబంధించి, పోలింగ్ స్టేషన్ 256 పరిధిలో బూత్ లెవెల్ అధికారులు ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) లో భాగంగా మొదట నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత పిఎస్ పరిధిలో ఉన్న మొత్తం ఓటర్లు, ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ, ఓటర్ల నుంచి తిరిగి తీసుకున్న పూరించిన ఫారాల సంఖ్య, డిజిటలైజేషన్ శాతం వివరాలను అడిగారు. ఆగస్టు మూడవ తేదీలోగా డిజిటలైజేషన్ పూర్తి కావాల్సి ఉన్నందున బిఎలీలు ఇంకా ఫారాలు పూరించి ఇవ్వని ఓటర్లతో తిరిగి తీసుకోవాలన్నారు. మరణించిన, డబుల్ ఓట్లు కలిగిన, చిరునామా మారిన, వలస వెళ్లిన ఓటర్ల విషయంలో నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలన్నారు. ఓటర్ల జాబితాలను ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో గద్వాల తహశీల్దార్ హరికృష్ణ, ఉప తహశీల్దార్ అజిత్, సూపర్వైజర్ తిమ్మప్ప, బిఎల్డీ సునీతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు