
భూపాలపల్లి, 31 జూలై (హి.స)
మారు మూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిలో ఐడిబిఐ సహకారంతో ఎంఎన్జి ఆసుపత్రి హైదరాబాద్, ఓమెగా ఆసుపత్రి కరీంనగర్ వైద్యులు, వైద్య సిబ్బందిచే ఉచిత క్యాన్సర్, కంటి నిర్ధారణ పరీక్షలు వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, ముఖ్యంగా మహిళలు క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా సర్వైకల్ పరీక్షలు నిర్వహణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పేదోళ్లకు ఉపయోగపడాలని, దాని ద్వారా వారు ఆర్థికంగా చితికి పోకుండా ఆదిలోనే వ్యాధిని గుర్తించి, వ్యాధి అంతు చూడాలని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెరి మీటర్, హెల్త్ ఏటిఎం, ఈసీజి వంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెల్త్ ఏ టి ఎం ద్వారా 64 రకాల వైద్య పరీక్షలను వేగంగా నిర్వహించే అవకాశం ఉంటుందని తెలిపారు. హెల్త్ ఏటీఎం ద్వారా నిర్వహించిన పరీక్షలకు కార్డు ఇస్తారని తద్వారా 5 సంవత్సరాలు వరకు రిపోర్ట్స్ భద్రంగా ఉంటాయని తెలిపారు. అలాగే కంటి పరీక్షల కోసం ప్రత్యేక యంత్రం, గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు ఈసీజీ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహిళలను సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. మహిళలు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే వైద్య సేవలు పొందడానికి అవకాశం ఉంటుందని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం, విద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మించి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం ఆగస్టు 4వ తేదీన ఎంఎన్నో ఆసుపత్రి ఆధ్వర్యంలో మరో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి ఆరోగ్య పరీక్షలు చేపించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా ఇప్పటివరకు కాటారం డివిజన్ పరిధిలో 680 మందికి హైదరాబాద్ లో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి వారికి చూపు ప్రసాదించినట్లు మంత్రి వెల్లడించారు. మంథని నియోజకవర్గ వ్యాప్తంగా 45 వేల మందికి కంటి చికిత్సలు చేపించినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ వైద్య క్యాంపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని మంత్రి అభినందించారు. అంతకు ముందు మంత్రి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలను పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు