
హైదరాబాద్, 31 జూలై (హి.స.)
ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ సంఘటన నేపథ్యంలో తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేసిన కేసీఆర్, తానొక ఆప్త మిత్రున్ని, ఉద్యమ సహచరున్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, పెద్ది అభిమానులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ సమయంలో పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని.. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. పెద్దిని బతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వప్రయత్నాలు, డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం పట్ల కేసీఆర్ మనోవేదనను వ్యక్తం చేశారు.
తెలంగాణనే శ్వాసగా, నీతి నిజాయితీతో ప్రజా జీవనం కొసాగిస్తూ సాగించిన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమన్నారు. పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ కొనియాడారు. ఉద్యమకాలం నుంచి చివరిశ్వాస వరకూ గులాబీ జెండా నీడలో, పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది, అటు పోరాటంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడని తెలిపారు. పార్టీపట్ల అత్యంత విధేయతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..