సమగ్ర దర్యాప్తు, పటిష్ఠమైన సాక్ష్యాధారాల సేకరణ, వేగవంతమైన విచారణతో నిందితులకు శిక్షలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
సమగ్ర దర్యాప్తు, పటిష్ఠమైన సాక్ష్యాధారాల సేకరణ, వేగవంతమైన విచారణతో నిందితులకు శిక్షలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Sp


రాజన్న సిరిసిల్ల, 31 జూలై (హి.స.)

సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్ఠమైన సాక్ష్యాధారాల సేకరణ, వేగవంతమైన విచారణతో నిందితులకు శిక్షలు పడేలా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు విశేష ఫలితాలు సాధిస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రశంసిస్తూ అభినందన పత్రాలు, ప్రోత్సాహకాలు అందజేశారు. ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం, గత ఆరు నెలల కాలంలో 44 కేసుల్లో 66 మంది నిందితులకు కోర్టులు జైలు శిక్షలు విధించాయి. వీటిలో ఐదు హత్య కేసుల్లో 19 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షలు విధించడం విశేషం. అదనంగా మూడు కేసుల్లో 20 సంవత్సరాల జైలు శిక్ష, రెండు కేసుల్లో 10 సంవత్సరాల శిక్ష, ఏడు కేసుల్లో 3 నుంచి 5 సంవత్సరాల శిక్ష, 17 కేసుల్లో 1 నుంచి 3 సంవత్సరాల శిక్ష, మరో 10 కేసుల్లో ఏడాది లోపు జైలు శిక్షలు విధించబడ్డాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిందితులకు శిక్షలు పడటంలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర కూడా అత్యంత కీలకమని పేర్కొన్నారు. హత్య, పొక్సో, హత్యాయత్నం, దోపిడీ, చోరీ తదితర కేసుల్లో శాస్త్రీయ ఆధారాలతో పకడ్బందీగా దర్యాప్తు నిర్వహించి, సాక్ష్యాలను కోర్టులో సమర్పించడం వల్ల శిక్షల శాతం పెరిగిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ ప్రతి కేసులో శాస్త్రీయ ఆధారాలను సేకరించాలని అధికారులకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande