భారీ వర్షాల హెచ్చరిక.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. సంగారెడ్డి జిల్లా కలెక్టర్
భారీ వర్షాల హెచ్చరిక.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. సంగారెడ్డి జిల్లా కలెక్టర్
Collector


సంగారెడ్డి, 31 జూలై (హి.స.)

రాష్ట్రంలో కొనసాగుతున్న

వాతావరణ మార్పులు, భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వచ్చే వారంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్లు సంగీత, పాండుతో కలిసి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, జిల్లాలో నమోదైన వర్షపాతం, రానున్న రోజుల వర్ష సూచనలు, చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠం చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాత భవనాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, కాలువల్లో నీటి ప్రవాహాన్ని ఇరిగేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. కాజ్వేలపై నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, అవసరమైన చోట పోలీస్ బందోబస్తు కల్పించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మిషన్ మోడ్లో నిర్వహించాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. రాత్రికి రాత్రే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి మండలంలో ప్రత్యేక విపత్తు నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలని, ప్రమాదకర చెరువులు, కాజ్వేల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande