
హైదరాబాద్, 31 జూలై (హి.స.)
కోర్టు ఉత్తర్వులు, ఇచ్చిన హామీలను ఉల్లంఘించినందుకు గాను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఎ.వి. రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట పాలనను అతిక్రమించినందుకు ఆయనను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని, ఆయన స్థానంలో మరొక అర్హులైన అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట గ్రామంలోని వివాదాస్పద 40 ఎకరాల స్థలానికి సంబంధించి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది.
చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు : హైకోర్టు..
గతంలో సదరు భూమి ప్రైవేటు ఆస్తి అని సివిల్ కోర్టు, హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఆ ఆస్తిలోకి తాము గానీ, తమ సిబ్బంది గానీ ప్రవేశించబోమని, ఎటువంటి జోక్యం చేసుకోబోమని హైడ్రా కౌన్సిల్ గతంలో కోర్టుకు లిఖితపూర్వక హామీ ఇచ్చిందని తెలిపింది. అయినప్పటికీ ఆ హామీని తోసిపుచ్చి అధికారులు, భారీ పోలీసు బలగాలు, జేసీబీలతో సదరు స్థలంలోకి ప్రవేశించి తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేయడం కోర్టు ఉత్తర్వులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, గ్రీకు పురాణాల్లోని 'హైడ్రా' అనే రాక్షస సర్పం తనకు తిరుగులేదని భావించినట్లే, తెలంగాణ హైడ్రా కూడా చట్టానికి అతీతులమని భావించకూడదని హితవు పలికింది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని, కోర్టు ఒత్తిడి పెరిగిన తర్వాతే సమర్పించే
అఫిడవిట్ క్షమాపణలను అంగీకరించలేమని పేర్కొంది. వ్యక్తుల పాలన కాదు... చట్ట పాలనే నడవాలి అని స్పష్టం చేస్తూ, రంగనాథ్ను తక్షణమే పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో మరో అర్హులైన అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..