ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలి.. వికారాబాద్ జిల్లా కలెక్టర్
ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలి.. వికారాబాద్ జిల్లా కలెక్టర్
Collector


వికారాబాద్, 31 జూలై (హి.స.) వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ శుక్రవారం బొంరాస్పేట్ మండలంలో ఆకస్మికంగా పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బొట్లవాని తండాలోని ఆశ్రమ పాఠశాల, నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించి ప్రభుత్వ సేవల అమలును పరిశీలించారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలతో పాటు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో పాముకాటు చికిత్సకు అవసరమైన మందులను తగినంత నిల్వ ఉంచాలని ఆదేశించారు. ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు ఆసరా పెన్షన్ కోసం అవసరమైన ధ్రువీకరణ పత్రాలను వెంటనే జారీ చేయాలని వైద్యాధికారిని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఇన్పేషెంట్ వార్డు, మందుల నిల్వ గది, ఆపరేషన్ థియేటర్ను పరిశీలించారు.

తర్వాత బొట్లవాని తండాలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ పదో తరగతి తెలుగు బోధనను పరిశీలించారు. విద్యార్థుల్లో విద్యతో పాటు సృజనాత్మకత పెంపొందించేలా ఇండోర్ గేమ్స్ ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. అనంతరం నాగిరెడ్డిపల్లి గ్రామంలో పూరిగుడిసెలో నివసిస్తున్న నర్సింలు కుటుంబాన్ని పరామర్శించిన కలెక్టర్, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హౌసింగ్ అధికారులకు సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande