
విశాఖపట్నం, 31 జూలై (హి.స.)
, విశాఖలో కలకలం సృష్టించిన యువతి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒడిశాలోని రాయగడ వద్ద సూట్కేసులో లభ్యమైన మృతదేహాన్ని విశాఖకు చెందిన యువతి సంధ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఒడిశా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి విషయమై సంధ్యతో గొడవ జరగడంతోనే ఆమెను హత్య చేసినట్లు నిందితుడు బొలిశెట్టి సురేశ్.. పోలీసుల ఎదుట అంగీకరించాడు. హత్య అనంతరం మృతదేహాన్ని సూట్కేసులో పెట్టి విశాఖలోని జ్ఞానాపురం రైల్వే స్టేషన్ నుంచి రైలులో రాయగడకు తరలించి అక్కడ పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుడు సురేశ్.. పోలీస్ వాహనానికి ఆప్టింగ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సూట్కేసులో లభ్యమైన మృతదేహం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఒడిశా పోలీసులు.. విశాఖకు చెందిన యువతిగా గుర్తించారు. నిందితుడిని గుర్తించడంతో కంచరపాలెం పోలీసుల సహకారంతో ఒడిశా పోలీసులు సురేశ్ను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ