
తిరుమల, 31 జూలై (హి.స.)తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తుల సంఖ్య శుక్రవారం ఉదయం భారీగా పెరిగింది. దీంతో తిరుమల కొండపై రద్దీ తీవ్రమైంది. ఉదయాన్నే భక్తులు పోటెత్తడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో, మిగిలిన భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఎలాంటి దర్శన టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి ప్రస్తుతం సుమారు 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు, అన్నప్రసాదాలు నిరంతరం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు నిన్నటి గణాంకాల ప్రకారం.. మొత్తం 67,063 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 25,565 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.81 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. రద్దీ దృష్ట్యా భక్తులు సహనంతో వ్యవహరించి టీటీడీ భద్రతా సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV