
నర్సంపేట, 31 జూలై (హి.స.)
నర్సంపేట మాజీ శాసనసభ్యులు (MLA), తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్, ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి పెద్ది సుదర్శన్ రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉద్యమ స్ఫూర్తిని నింపిన నాయకుడిగా, ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ప్రజానాయకుడిగా ఆయనను గుర్తుచేసుకున్నారు. ఆయన అకాల మరణం తెలంగాణ (Telangana) సమాజానికి, బీఆర్‌ఎస్ పార్టీకి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటని అన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi