ఇది ప్రజల భద్రతకు, ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం: మంత్రి లోకేశ్
ఇది ప్రజల భద్రతకు, ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం: మంత్రి లోకేశ్
Lokesh


రాజమహేంద్రవరం, 07 జూలై (హి.స.)

సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఫిర్యాదుపై రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ తక్షణమే స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో ఇసుక లారీల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రోడ్డు సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. టీడీపీ మహిళా కార్యకర్త జాహ్నవి చేసిన ట్వీట్‌కు స్పందించిన ఆయన, ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరం సమీపంలోని కాతేరు, మల్లయ్యపేట ప్రాంతాల్లోని రోడ్లు ఇసుక లారీల నిరంతర రాకపోకలతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. రోడ్లన్నీ గుంతలమయంగా మారి, వాహనాల రాకపోకలతో పెద్ద ఎత్తున దుమ్ము లేస్తోంది. ఈ దుమ్ము స్థానికుల కళ్లలోకి, ముక్కుల్లోకి చేరి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఈ సమస్యపై టీడీపీ కార్యకర్త జాహ్నవి గత నెలలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌లను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో ఫిర్యాదు చేశారు.

గత రెండేళ్లుగా ఈ సమస్య గురించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని జాహ్నవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఆ మార్గంలో పర్యటిస్తే మాత్రమే తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారని, ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా కూడా అలాగే చేశారని ఆమె పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande