
కామారెడ్డి, 09 జూలై (హి.స.)
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ప్రతి నెల నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన గోదాంను సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేసి, నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా గోదాం పరిసర ప్రాంతాల భద్రత, రికార్డుల నిర్వహణ, సీలింగ్ ప్రక్రియ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అన్ని భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సామగ్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన చోట అదనపు భద్రతా సిబ్బందిని నియమించి, గోదాం పై నిరంతర నిఘా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు