
అమరావతి, 08 జూలై (హి.స.)
దక్షిణ కొరియా బుసాన్లో హ్వాసంగ్ గ్రూప్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈరోజు (బుధవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఏపీలో హ్వాసంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఆహ్వానం పలికారు. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఫుట్వేర్ కాంపొనెంట్ & మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు.
ఏపీలో నెక్స్ట్జెన్ అథ్లెటిక్ ఫుట్వేర్ ఆర్అండ్డీ, ఆసియా-పసిఫిక్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కుప్పం కేంద్రంగా దక్షిణ భారత సమగ్ర ఫుట్వేర్ తయారీ క్లస్టర్కు ప్రతిపాదన చేశారు. తిరుపతిలో విడిభాగాల తయారీ, విశాఖలో డిజైన్, లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు ప్రతిపాదించారు. ఏపీలో టైర్-1, టైర్-2 వెండర్లతో సప్లయర్ మీట్ నిర్వహించాలని హ్వాసంగ్కు ఆహ్వానం పలికారు. కుప్పంలో రూ.900 కోట్లతో గ్రీన్ఫీల్డ్ నాన్-లెదర్ ఫుట్వేర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు హ్వాసంగ్ ప్రతినిధులు తెలిపారు.
ఏడాదికి 2 కోట్ల జతల స్పోర్ట్స్ షూల తయారీ లక్ష్యంగా హ్వాసంగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని వివరించారు. అడిడాస్ సహా గ్లోబల్ బ్రాండ్లకు OEM సరఫరాదారుగా హ్వాసంగ్ ఉండనుందని వెల్లడించారు. తొలి దశలో ఎగుమతులు.. ఆపై దేశీయ మార్కెట్పై దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని హ్వాసంగ్ ప్రతినిధులు తెలిపారు.
షూఆల్స్ ఫ్యాక్టరీని సందర్శించిన లోకేశ్
అలాగే బుసాన్లోని షూఆల్స్ స్మార్ట్ హెల్త్కేర్ ఫుట్వేర్ ఫ్యాక్టరీని మంత్రి లోకేశ్ సందర్శించారు. అధునాతన టెక్నాలజీతో బూట్ల తయారీ ప్రక్రియను పరిశీలించారు. మెడికల్ మాగ్నెటిక్ జనరేటర్లు, స్మార్ట్ చిప్లతో తయారయ్యే షూస్పై ఆసక్తి కనపరించారు. పాదాల ఆరోగ్యానికి ప్రత్యేక వైబ్రేషన్ చిప్ టెక్నాలజీని లోకేశ్ పరిశీలించారు. రక్తప్రసరణ మెరుగుదల, కండరాల అలసట తగ్గించే స్మార్ట్ ఫుట్వేర్ తయారీ గురించి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ