
హైదరాబాద్, 08 జూలై (హి.స.)ఎల్.బి.నగర్-హయత్నగర్ డబుల్ డెక్కర్ పైవంతెనకు టెండర్లు పిలిచి... ఏడాదిలోపు పనులను సైతం ప్రారంభిస్తామని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. రూ.10,410 కోట్లతో విజయవాడ వరకు చేపట్టనున్న ఆరు వరుసల రహదారితోపాటు రెండు లేన్ల సర్వీస్ రోడ్డు పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. రూ.338 కోట్ల వ్యయంతో ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో హ్యామ్ విధానంలో చేపట్టనున్న ఆధునిక నాలుగు వరుసల రహదారి పనులకు సంబంధించి మంగళవారం రంగారెడ్డి జిల్లా తొర్రూర్లో మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా చేపట్టే గ్రీన్ఫీల్డ్ రహదారితోపాటు దీనికి సమాంతరంగా బుల్లెట్ రైలు మార్గానికి డీపీఆర్ను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరో మూడు రహదారులకు అదనంగా రూ.100 కోట్లతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. విద్య, వైద్యానికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్