
హైదరాబాద్, 08 జూలై (హి.స.)రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయదల్చిన తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఆర్పీడీసీఎల్) ఏర్పాటులో కొత్త మలుపు చోటుచేసుకుంది. రైతు డిస్కం ఏర్పాటు ప్రక్రియలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారికి మాతృసంస్థ అయిన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) నుంచి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) నిరాకరించడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు టీజీఎస్పీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ అనిల్ కుమార్ ఈ ఏడాది మార్చి 1 నుంచి రైతు డిస్కం ఏర్పాటుకు సంబంధించి పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు.
కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) వద్ద కంపెనీ నమోదు, అవసరమైన కార్పొరేట్ వ్యవహారాలు, తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ (టీజీఈఆర్సీ)లో పంపిణీ లైసెన్స్ దరఖాస్తు తయారీ, సమర్పణ, కంపెనీ రిజిస్ట్రేషన్ చేసే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తనకు ఎన్వోసీని మంజూరు చేయాలని అనిల్కుమార్ చేసిన విజ్ఞప్తిని టీజీఎస్పీడీసీఎల్ తిరస్కరిస్తూ రెండురోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ కుమార్కు ఎన్వోసీ జారీ చేయకపోతే రైతు డిస్కం ఏర్పాటులో మరింత జాప్యం నెలకొనే అవకాశాలుంటాయని విద్యుత్రంగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కొత్త నియామకాల్లేవ్.. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత
విద్యుత్ సంస్థల్లో కొన్నేళ్లుగా కొత్త నియామకాలు లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఎస్పీడీసీఎల్లో సెక్షన్ స్థాయిలో ఏఈలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ డిస్కం నుంచి పెద్ద సంఖ్యలో సిబ్బందిని రైతుడిస్కంకు డిప్యూటేషన్పై బదిలీ చేస్తే మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలుంటాయని పలు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్