
నాగర్ కర్నూల్, 08 జూలై (హి.స.)
ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆయన నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట బస్టాండ్లో 11.5 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోను పట్టణాలకు దీటుగా రహదారులు, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తిమ్మాజిపేట బస్టాండ్కు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నందున సీసీ రోడ్డు నిర్మాణంతో దుమ్ము, బురద సమస్యలు తొలగిపోవడంతో పాటు ప్రయాణికులకు, వాహనదారులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం బిజినపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషను ప్రారంభించారు. విద్యుత్ సరఫరాను మరింత బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఈ సబ్స్టేషను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు