
అమరావతి, 08 జూలై (హి.స.)
దక్షిణ కోస్తా జోన్ పరిధిలోని విజయవాడ డివిజన్ సమయ పాలనలో కొత్త రికార్డు నెలకొల్పింది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో సమయం పాటించడంలో చరిత్ర సృష్టించింది. ఈ నెల 6వ తేదీన 192 రైళ్లు 97.35 శాతం కచ్చిత వేళకు బయలుదేరాయి. గత ఏడాది ఆగస్టు 6న 181 రైళ్ల నిర్వహణలో నమోదైన 97.24 శాతం రికార్డును అధిగమించింది.రైల్వే అధికారులు, సిబ్బంది అంకిత భావం, ముందస్తు కార్యాచరణ, సమర్థ రైళ్ల నిర్వహణ, వివిధ విభాగాల మధ్య సమన్వయం, నిరంతర పర్యవేక్షణ, ఉద్యోగుల కృషి ప్రధాన కారణమని డీఆర్ఎం మోహిత్ సొనాకియా వెల్లడించారు. దేశంలోనే అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన విజయవాడ డివిజన్లో సిబ్బంది కృషి ఫలితంగా సమయపాలనలో రికార్డు నెలకొల్పడం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. విశ్వసనీయమైన, నాణ్యమైన సేవలు అందించాలనే రైల్వే సంకల్పానికి నిదర్శనమన్నారు. భవిష్యత్తులోనూ ప్రయాణికుల సేవలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని డీఆర్ఎం కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ