
హైదరాబాద్, 08 జూలై (హి.స.)
కాళేశ్వరంపై పొలిటికల్ గేమ్ నడుస్తుందని, తెలంగాణ రైతులపై ఏదో బీఆర్ఎస్ నేతలకే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు, సీఎం రేవంత్ రెడ్డి ఏమీ చేయడం లేదన్నట్టు హరీష్ రావు రోజూ మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. కాళేశ్వరం విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చారు. 'కాళేశ్వరం ప్రాజెక్టుకు సిమెంట్, ఇసుక కలిపింది నువ్వే, ఇటుకలు పేర్చింది నువ్వే. ఇరిగేషన్ శాఖా మంత్రిగా అక్కడ రాత్రిపూట మంచం వేసుకుని పడుకున్నానని చెప్పుకున్నది నువ్వే. మీరు కట్టిన ప్రాజెక్టు మీ హయాంలోనే కూలిపోతే దానికి బాధ్యులు మీరా? లేక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వమా?' అని ప్రశ్నించారు. నాడు రేవంత్ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారా లేక మంత్రిగా ఉత్తమ్ ఉన్నారా అని నిలదీశారు. పదే పదే కాంగ్రెస్ను బ్లేమ్ చేసే పని మానుకోవాలన్నారు.
బీఆర్ఎస్ టార్గెట్ రేవంత్ రెడ్డి అని అసెంబ్లీ ఉన్నప్పుడు మాత్రం కేసీఆర్ రారన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అని సీఎం రేవంత్ అడుగుతున్నా ఎందుకు రావడం లేదని నిలదీశారు. నిన్ను కేసీఆర్ ఇరిగేషన్ మంత్రిగా ఎందుకు తొలగించారో హరీశ్ రావు సమాధానం చెప్పాలన్నారు. నువ్వు కాళేశ్వరంలో తప్పులు చేశావ్ కాబట్టే కేసీఆర్ తప్పించారన్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాంగ్రెస్ ది కాదని అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్నారు. అక్కడ నీళ్ళు నిలువ ఉంచవద్దని ఒక వేళ నీళ్లు నిల్వ చేస్తే భద్రాచలంకొట్టుకుపోతుంది అని హెచ్చరించిందన్నారు. ఖమ్మం కొట్టుకు పోయినా ఫరవాలేదా? హరీష్ అని ప్రశ్నించారు. ఖమ్మం ప్రజలు అక్కర లేదా? నీళ్లు ఆపడం వల్ల జరిగే ప్రమాదం కూడా ప్రజలు ఆలోచన చేయాలన్నారు. హరీశ్ రావు మంత్రిగా ఫెయిల్ అయ్యారని అందుకే కాళేశ్వరం కుంగింది..కూలిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు