
కరీంనగర్, 08 జూలై (హి.స.)
సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో బుధవారం 12వ వార్డులో శానిటేషన్ క్లీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఒకటవ వార్డు సుగ్లాంపల్లిలో మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుల్తానాబాద్ మున్సిపల్ను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అందులో భాగంగానే వార్డులలో సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణంతో పాటు రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న శ్రీరాంపూర్ రోడ్డును ఆధునీకరించి సెంటర్ లైటింగ్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే నాలుగు నెలల కాలంలో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని వివరించారు.
1,2,13,14,15 వార్డుల్లో పనులు మొదటి విడతలో శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రజలు విశ్వాసం ఉంచి 15 వార్డుల్లో 13 వార్డులు కాంగ్రెస్ అభ్యర్థులను ఘనవిజయంతో గెలిపించడం జరిగిందని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని వివరించారు. మహిళల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, స్వయం సహాయక సంఘాల బలోపేతం, ఉపాధి అవకాశాల కల్పన, మహిళలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన దిశగా నిరంతరం కృషి చేస్తోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..