
కడప, 08 జూలై (హి.స.)కడప జిల్లాలోని రిమ్స్ డెంటల్ కళాశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. గత రాత్రి హాస్టల్లో ఉన్న 20 మందికిపైగా విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ మెస్లో రాత్రి దోశలు తిన్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. వెంటనే వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఘటనను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం బయటకు రాకుండా బాధిత విద్యార్థులకు రిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఫుడ్ పాయిజన్కు మెస్లో వడ్డించిన ఆహారమే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో హాస్టల్ విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV