
అమరావతి, 09 జూలై (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నత విద్య ఫీజుల భారం పెరుగుతోంది. 2025-26విద్యా సంవత్సరంలో రీయింబర్స్మెంట్ కింద సగటున ఒక్కో విద్యార్థిపై రూ.58,083 చెల్లించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ భారం మరింత పెరగనుంది. గతేడాది వరకు కనీస ఫీజు రూ.40వేలు ఉండగా ఇప్పుడు దానిని రూ.47 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఖజానాపై దాదాపు రూ.140 కోట్ల వరకూ అదనపు భారం పడనుంది. ఫీజుల ఖరారు పూర్తయిన తర్వాత ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్లో భాగంగా ప్రభుత్వం వంద శాతం ఫీజు చెల్లిస్తోంది. 2025-26 విద్యా సంవత్సరంలో 3,65,876 మంది ఈ పథకం కింద ఇంజనీరింగ్ చదివారు. వారిలో ఫైనలియర్ విద్యార్థులు కోర్సులు పూర్తిచేసుకుని బయటకు వెళ్లగా మిగిలిన మూడేళ్ల విద్యార్థులు కొనసాగుతున్నారు. వీరి ఫీజులకు మొత్తం రూ.2,125 కోట్లు అయింది. గతేడాది 125 కాలేజీలకు కనీస ఫీజు రూ.40 వేలు ఉండగా, వాటిలో 32శాతం మంది విద్యార్థులు చదువుతున్నారు. రూ.90 వేల నుంచి రూ.1.05 లక్షల వరకు ఫీజులున్న కాలేజీలు 10 ఉన్నాయి. వాటిలో 7.4 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 222 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 56శాతం కనీస ఫీజు పరిధిలోనే ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ