ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి ఒక్కసారిగా ఘోర రక్తపాతం....నడిరోడ్డుపై డబుల్ మర్డర్ కలకలం
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి ఒక్కసారిగా ఘోర రక్తపాతం....నడిరోడ్డుపై డబుల్ మర్డర్ కలకలం
నడిరోడ్డుపై డబుల్ మర్డర్ కలకలం


తిరుపతి, 09 జూలై (హి.స.)టెంపుల్ సిటీ తిరుపతిలో గురువారం ఒక్కసారిగా కలకలం రేగింది. నగరంలోని లక్ష్మీపురం సర్కిల్, శ్రీ పద్మావతి కళ్యాణ మండపాల వద్ద పగటిపూటే నడిరోడ్డుపై ప్రత్యర్థులు విచక్షణారహితంగా దాడి చేసి ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశారు. మృతులను జీవకోనకు చెందిన మునిరత్నం (50), మణికంఠగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. అప్పటికే అక్కడ కాపు కాసిన ప్రత్యర్థులు, రెండు బైక్లపై వీరిని వెంబడించారు. లక్ష్మీపురం సర్కిల్ వద్దకు రాగానే బైక్పై వెళ్తున్న మునిరత్నం, మణికంఠలను అడ్డుకుని కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు.

కత్తిపోట్లకు గురైన వారిలో ఒకరు రోడ్డుపైనే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడి, కొనఊపిరితో ఉన్న మరో వ్యక్తిని స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన కూడా మృతి చెందారు. బాధితుడు రోడ్డుపై పడి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ నిందితులు ఏమాత్రం జాలి లేకుండా కసితీరా కత్తులతో పొడవడం అక్కడి వారిని భయబ్రాంతులకు గురి చేసింది.

హత్య జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల ఉన్న కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. ఆ విజువల్స్ ఆధారంగా… నలుగురు పురుషులతో పాటు ఒక మహిళ కూడా ఈ ఘోర హత్యలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. హత్య అనంతరం నిందితులు రెండు బైక్లపై వేగంగా పరారైనట్టుగా తెలిసింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే డిఎస్పీ భక్తవత్సలం, ఈస్ట్ సీఐ శ్రీనివాసులు, వెస్ట్ సీఐ రామకృష్ణ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande