
హైదరాబాద్, 09 జూలై (హి.స.)తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు(గురువారం)జిల్లా పర్యటనలో భాగంగా సీతారాంపూర్ ప్రీమియర్ ఎనర్జీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతదేశ అత్యాధునికి నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రపంచంలో బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్ ఉందన్నారు. భాగ్యనగరాన్ని కూడా కాలుష్య సమస్య వేధిస్తోందని చెప్పారు. మూసీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించామన్నారు. కోర్ అర్బన్ ఏరియాను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక పాలసీ రూపొందించనున్నట్లు వెల్లడించారు.
పరిశ్రమలను ఔటర్ అవతలకు తరలించబోతున్నామని సీఎం తెలిపారు. ఓఆర్ఆర్ అవతల పరిశ్రమలకు భూములు కేటాయిస్తామన్నారు. ORR, RRR మధ్య పారిశ్రామికవాడలు ఏర్పాటు కానున్నాయన్నారు. RRR అవతల అగ్రి ఎకానమీ డెవలప్ చేస్తున్నామని చెప్పారు. 2034 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశ జీడీపీలో 10శాతం వాటా తెలంగాణ నుంచే ఉండాలన్నారు. బ్లూకాలర్ ఎంప్లాయిస్లో కొత్త స్కిల్స్ పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసమే స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్