
హైదరాబాద్, 09 జూలై (హి.స.)డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ కౌంటర్ ఇచ్చారు. తాడిచర్ల-2 గని కేటాయింపు పూర్తిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి ఫలితమేనని అన్నారు. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ తాడిచర్ల-2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించలేకపోయిందని విమర్శించారు. సింగరేణికి మీరేం చేశారని భట్టి విక్రమార్కను ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డగా, సింగరేణి కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ గనిని సింగరేణికి కేటాయింపునకు కృషి చేశారని పేర్కొన్నారు. తాడిచర్ల గని కేటాయింపును సింగరేణి కార్మిక సంఘాలు స్వాగతిస్తూ ప్రధాని మోదీ, కిషన్ రెడ్డికి పాలాభిషేకాలు చేస్తున్నాయని తెలిపారు. కార్మికుల్లో వ్యక్తమవుతున్న ఆనందాన్ని, బీజేపీకి వస్తున్న ప్రజాదరణను కాంగ్రెస్ సహించలేకపోతుందన్నారు.
సింగరేణి ఆర్థిక పరిస్థితిపై కూడా పాయల శంకర్ తీవ్ర విమర్శలు చేశారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిపై రూ.32 వేల కోట్ల బకాయిలు మోపిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రూ.22 వేల కోట్ల బకాయిలు పెట్టిందని అన్నారు. మొత్తం రూ.55 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని వ్యాఖ్యానించారు.
సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని, సంస్థ వ్యవహారాల్లో కేంద్రం మరింత చురుకుగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తన 51 శాతం వాటా పేరుతో సింగరేణి నిధులను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బంగారు గనిలాంటి సింగరేణిని చీకట్లోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అదే సమయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని పాయల శంకర్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్