TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
Tgsrtc


హైదరాబాద్, 09 జూలై (హి.స.)తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నియామకాలను ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా చేపట్టనుండగా, చాలా ఏళ్ల తర్వాత శాశ్వత ప్రాతిపదికన కండక్టర్ పోస్టుల భర్తీ జరగనున్నాయి.

రాత పరీక్ష లేకుండానే:

ఈ నియామకాలలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. పదో తరగతి (SSC)లో సాధించిన మార్కుల శాతాన్ని ఆధారంగా తీసుకుని.. ప్రభుత్వం అమలు చేస్తున్న రోస్టర్ విధానం, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దీంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఇది పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం.

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి:

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో శాశ్వత ప్రాతిపదికన కండక్టర్ పోస్టులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. గత కొన్నేళ్లుగా పదవీ విరమణలతో ఖాళీలు పెరుగుతున్నప్పటికీ.. హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా ఔట్సోర్సింగ్ సిబ్బందితోనే సేవలు నిర్వహించారు. ఇప్పుడు ప్రభుత్వం శాశ్వత నియామకాలకు అనుమతి ఇవ్వడంతో ఉద్యోగార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

నోటిఫికేషన్కు సాంకేతిక అడ్డంకి:

అయితే అధికారిక నోటిఫికేషన్ విడుదలకు ముందు ఒక సాంకేతిక సమస్యను పరిష్కరించాల్సి ఉంది. గతంలో ఎస్ఎస్సీ బోర్డు మార్కుల విధానాన్ని అమలు చేయగా, ఆ తర్వాత కొంతకాలం GPA గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల మళ్లీ మార్కుల విధానాన్ని కొనసాగిస్తోంది. దీంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరికి మార్కులు, మరికొందరికి GPA గ్రేడింగ్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రేడింగ్ విధానాన్ని మార్కుల శాతంగా ఎలా మార్చాలి? రెండు విధానాల అభ్యర్థులను సమానంగా ఎలా అంచనా వేయాలి? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు ఎస్ఎస్సీ బోర్డుకు లేఖ రాశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande