దేశం అత్యుత్తమ వైద్య కేంద్రంగా బీబీనగర్ ఎయిమ్స్.. కేంద్రమంత్రి
దేశం అత్యుత్తమ వైద్య కేంద్రంగా బీబీనగర్ ఎయిమ్స్.. కేంద్రమంత్రి
Nadda


యాదాద్రి భువనగిరి, 09 జూలై (హి.స.)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గురువారం బీబీనగర్ ఎయిమ్స్ లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్, ఎయిమ్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రులు బీబీనగర్ ఎయిమ్స్ లోని అన్ని భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, బీబీనగర్ ఎయిమ్స్్స్ను దేశంలోనే అత్యుత్తమ'సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్' గా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జేపీ నడ్డా పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం రూ.1,000 కోట్ల వ్యయంతో కొనసాగుతోందని, ఇప్పటివరకు 87 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 24 విభాగాలు పనిచేస్తుండగా, ఇప్పటికే రెండు ఎంబీబీఎస్ బ్యాచ్లు విద్యాభ్యాసం చేస్తున్నాయని వెల్లడించారు.

బీబీనగర్ ఎయిమ్స్ లో రోజుకు సుమారు 1,800 మంది ఓపీ రోగులకు వైద్య సేవలు అందుతున్నాయని, అత్యవసర వైద్య సేవలతో పాటు అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. టెలీమెడిసిన్ సేవలను కూడా విజయవంతంగా అందిస్తున్నామని, ఇప్పటికే లక్ష మందికి పైగా ప్రజలు ఈ సేవలను వినియోగించుకున్నారని తెలిపారు. పరిశోధన రంగానికి కేంద్ర ప్రభుత్వం రూ.64 కోట్ల నిధులు మంజూరు చేసిందని, ప్రస్తుతం 128 పరిశోధన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

దేశంలో ఎయిమ్స్ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ, 20వ శతాబ్దంలో ఢిల్లీలో ఒక్క ఎయిమ్స్ మాత్రమే ఉండేదని, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి హయాంలో మరో ఐదు ఎయిమ్స్లు ఏర్పాటు చేశారని తెలిపారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 23 కొత్త ఎయిమ్స్కు శ్రీకారం చుట్టిందని, వాటిలో ఇప్పటికే 14 పూర్తి కాగా, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ పూర్తి స్థాయిలో బోధనా సిబ్బంది అందుబాటులో ఉందని, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో ఆరోగ్య రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ ఎయిమ్స్ ఈ స్థాయికి చేరుకోవడానికి 20 సంవత్సరాలు పట్టిందని, అదే స్థాయి అభివృద్ధిని బీబీనగర్ ఎయిమ్స్ చాలా వేగంగా సాధిస్తోందని జేపీ నడ్డా పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande