
అమరావతి, 01 ఆగస్టు (హి.స.)
: కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం నిధులను నిబంధనల మేరకు ఇచ్చేందుకు.. అన్ని అర్హతలు ఉన్న ఆలయం.. విజయవాడ దుర్గగుడి. రోజూ 50 వేలకు పైగా, ఏటా రెండు కోట్ల మంది వరకూ భక్తులు వచ్చే ఆలయానికి అన్ని అర్హతలు ఉన్నా.. కేవలం చిత్తశుద్ధి లేకనే ప్రసాద్ పథకం నిధులు రావడం లేదు. తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో దుర్గగుడి సమగ్ర అభివృద్ధి కోసం ప్రసాద్ పథకం కింద నిధులను అందించాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. వారణాశి, అయోధ్య తరహాలో దుర్గమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఎంపీ విజ్ఞప్తితో.. మరోసారి కేంద్ర నిధులపై ఆశలు చిగురించాయి.
దేశంలో అత్యధికమంది భక్తులు వచ్చే ఆలయాల అభివృద్ధికి అందించే ప్రసాద్ పథకం నిధుల కోసం పదేళ్ల కిందటే దుర్గగుడి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ తర్వాత ప్రయత్నం చేసిన శ్రీశైలం లాంటి ఆలయాలకు ఎప్పుడో రూ.50 కోట్ల వరకూ నిధులొచ్చినా.. దుర్గగుడికి మాత్రం రాలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ