
అమరావతి, 01 ఆగస్టు (హి.స.)
భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కాళేశ్వరం వైపు నుంచి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 53 అడుగులకు చేరుకోవటంతో అధికారులు మూడవ ప్రమాద (చివరి) హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయానికి 55.1 అడుగులకు చేరింది. కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్రాజ్ క్షేత్రస్థాయిలో పర్యటించి.. లోతట్టు ప్రాంతవాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వాగులు దాటకుండా బందోబస్తు పాటించాలని సూచించారు. వరద నీటిమట్టం పెరగటంతో దుమ్ముగూడెం-భద్రాచలం మధ్య శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద స్నానఘట్టాలు నీట మునిగాయి. సీతవాగు వద్ద సీతమ్మ నారచీరలు, స్వామివారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జి నీటమునిగాయి. తూరుబాక ఆర్అండ్బీ ప్రధాన రహదారిపై ఇటీవల నిర్మించిన హైలెవల్ వంతెన ఇరువైపులా అప్రోచ్లు కోతకు గురై ప్రమాదకరంగా తయారయ్యాయి. ఎగువ నుంచి ఉన్నట్టుండి వచ్చిన వరద చుట్టుముట్టడంతో చర్ల మండలంలోని వీరాపురం శివారు ఇసుక క్వారీలో దాదాపు 44 మంది లారీ డ్రైవర్లతోపాటు స్థానికులు చిక్కుకుపోయారు. అధికారులు వీరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 30కు పైగా లారీలు క్వారీలోనే ఉన్నాయి. క్వారీలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సీఐ రాజువర్మ, ఎస్సై నర్సిరెడ్డి తెప్ప మీద వెళ్తున్న క్రమంలో వరద నీటిలో పడిపోయారు. ఈదుకుంటూ తిరిగి వారిద్దరూ తెప్పపైకి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ