రూ. 52 కోట్ల పెట్టుబడి మోసం.. కేరళలో కేటుగాడి అరెస్ట్.. భద్రాచలంలో భారీ ఆస్తుల గుర్తింపు!
రూ. 52 కోట్ల పెట్టుబడి మోసం.. కేరళలో కేటుగాడి అరెస్ట్.. భద్రాచలంలో భారీ ఆస్తుల గుర్తింపు!
Crime


భద్రాద్రి కొత్తగూడెం, 01 ఆగస్టు (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన రూ.52 కోట్ల భారీ పెట్టుబడి మోసం కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్ను కేరళ రాష్ట్రంలోని పాలా ప్రాంతంలో అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ శనివారం వివరాలు వెల్లడించారు. ఫిర్యాదుదారుడు భార్పాటీ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు తాను భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్ లేబర్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నానని, తనతో భాగస్వామిగా ఉంటే కాంట్రాక్ట్ పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానని నమ్మబలికి పలువురు బాధితుల నుంచి సుమారు రూ.52 కోట్ల పెట్టుబడులను మోసపూరితంగా సేకరించినట్లు విచారణలో తేలింది.

బాధితుల విశ్వాసాన్ని పొందేందుకు నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు రూపొందించి, లాభాల్లో 4 శాతం వాటా ఇస్తామని హామీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే బీకే నాయుడు అండ్ కో., రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్పై జిల్లాకు తీసుకొచ్చి విచారించారు. విచారణలో భాగంగా 6 బస్సులు, ఒక వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, 2 ట్రైలర్లు కలిపి మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మోసపూరితంగా సేకరించిన డబ్బుతో భద్రాచలంలోని రాజీవ్నగర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం, ఒక ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, పత్రాల పరిశీలన కొనసాగుతోందని, మరిన్ని బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, పూర్తి మనీ ట్రైల్ను వెలికితీయడం కోసం దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు. అధిక లాభాల పేరుతో ఆకర్షించే పెట్టుబడి పథకాలను గుడ్డిగా నమ్మవద్దని ప్రజలకు సూచించిన పోలీసులు, అనుమానాస్పద పెట్టుబడి సంస్థలు లేదా వ్యక్తులపై సమాచారం తెలిసినా, మోసానికి గురైన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన లక్ష్మీదేవిపల్లి పోలీసులు, జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande