పంటలను గట్టెక్కించిన వర్షాలు
22.86 లక్షల ఎకరాల్లో వరి 98% విస్తీర్ణంలో పత్తి సాగు.
Revanthreddy


హైదరాబాద్, 01 ఆగస్టు (హి.స.)తెలంగాణలో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటల సాగు విస్తరిస్తోంది. మొత్తం 1,32,38,446 ఎకరాలకుగాను 85,38,203ఎకరాల్లో(64%) పంటలు వేశారు. పత్తి సాగు మొత్తం విస్తీర్ణంలో 98 శాతానికి పెరగ్గా..వరి పంట 22.86 లక్షల ఎకరాలకు చేరింది. వానాకాలం సీజన్ ఆరంభం నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొనగా..పంటల సాగుపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో మొలక దశలో ఉన్న పత్తి నిలదొక్కుకుంది. చెరువులు, కుంటల్లోకి చేరిన నీటితో పత్తి పంటకు మరో రెండు నెలల వరకు ఢోకా లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వరి రైతులు నాట్లు వేస్తున్నారు. వరి స్వల్పకాలిక రకాలు వేస్తేనే ఫలితముంటుందని.. పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలు సైతం పండే వీలుందని అధికారులు చెబుతున్నారు. నిరుడు ఈ సమయానికి 89,16,058 ఎకరాల్లో పంటలు వేయగా ఈసారి 3,77,833 లక్షల ఎకరాలు తక్కువగా ఉంది.

12 జిల్లాల్లో ఇంకా వర్షాభావమే..

వానాకాలం సీజన్లో శుక్రవారం వరకు 61 రోజులకు గాను ఇప్పటికి 33 రోజులే వర్షం పడింది. మొత్తం 621 మండలాలకుగాను 253 మండలాల్లో సాధారణ వర్షపాతం, 119 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. 235 మండలాల్లో లోటు, మరో 14 మండలాల్లో అధికలోటు ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇంకా వర్షాభావమే ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande