
హైదరాబాద్, 01 ఆగస్టు (హి.స.)
రాష్ట్రాల ఆర్థిక స్థితిని మరింత బలపరిచేందుకు మరియు మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పన్నుల వాటా (Tax Devolution) కింద దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక్కసారిగా రూ.1,09,019 కోట్లను విడుదల చేసింది. సహజంగా ప్రతీ నెలా ఇచ్చే గడువు (ఆగష్టు 10) కంటే ముందే ఈ అదనపు వాటాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేయడం విశేషం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాల వద్ద తగినంత నిధుల లభ్యత పెరిగి, అభివృద్ధి ప్రాజెక్టులు మరియు సంక్షేమ పథకాలు మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం కలుగుతుంది.
తెలుగు రాష్ట్రాలకు వచ్చిన వాటా..
పన్నుల వాటా కింద ఏపీకి రూ. 4,597 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి రూ. 2,370 కోట్లు కేటాయించారు. కేంద్రం నుంచి అదనపు వాటా ముందుగానే అందడంతో తెలుగు రాష్ట్రాలు తీవ్ర నిధుల సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశముంది. మూలధన వ్యయం (Capital Expenditure) పెంచడానికి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరాయంగా అమలు చేయడానికి ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని కేంద్రం తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..