
హైదరాబాద్, 01 ఆగస్టు (హి.స.)
తెలంగాణలోనే ఎన్నో సందర్భాల్లో వార్తను వార్తలా రాయలేని పరిస్థితి లేదా..? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది.. కేంద్ర మంత్రి కుమారుడు ఈ దుర్మార్గమైన పని చేశాడని ఆ అమ్మాయి తల్లీదండ్రులు వచ్చి ఫిర్యాదు చేస్తే వారం రోజులు ఏ మీడియా రిపోర్ట్ చేసింది..? సోషల్ మీడియానే లేకపోతే ఆ అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న సెమినార్లో 'రాజ్యాంగం ప్రజాస్వామ్యం – పత్రికా స్వేచ్ఛ' అంశంపై కేటీఆర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లగచర్లలో గిరిజనుల మీద అకృత్యాలు జరిగితే ఏ మీడియా రాసింది.. నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి ఎవరూ ఏం అనుకోవద్దు.. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితుల్లో డైరెక్టుగా శాసనసభలో, బయట ప్రభుత్వంలో ఉన్న పెద్దలు జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే కూడా ఏ మీడియా ప్రశ్నించింది..? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కదం తొక్కే దాకా ఏ మీడియా రాసింది..? ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం.. ఉందా..? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్లీ నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నది ఉన్నట్టుగా అడుగుతున్నా.. ఉన్నదా రాసే పరిస్థితి.. చెప్పే పరిస్థితి ఉన్నదా..? అందరి ముందటే అడుగుతున్నా స్వేచ్చగా, నిర్భీతిగా పరిశోధనాత్మక కథనాలు వస్తున్నాయా..? వాస్తవాలు చెబితే నచ్చవన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..